
హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్
పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును శనివారం పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్లో మహిళల గొంతు నొక్కారని, రాష్ట్రంలో తమ ద్వారా నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. 2023లో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, ఇప్పుడు వ్యతిరేకంగా ఓటు వేయడం వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతుందని విమర్శించారు.
మహిళల సాధికారతపై మాటల్లో మద్దతు ఇచ్చి, ఆచరణలో అడ్డుకోవడం కాంగ్రెస్ విధానమని ఆయన పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే సామాన్య మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు పెరుగుతాయనీ అయితే కుటుంబాధిపత్య రాజకీయాలు చేసే కాంగ్రెస్కు ఇది ఇష్టం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. గత 30 ఏళ్లుగా మహిళా బిల్లును వాయిదా వేస్తూ వస్తోందని కూడా విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ, మహిళల హక్కులను అడ్డుకున్న కాంగ్రెస్ను ప్రజలు క్షమించరని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు