
హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)
2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే, దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లోపు నాటి మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నది అబద్ధమని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం కాంగ్రెస్ పెద్దలను కలిసి బిల్లు వీగిపోయినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో వీగిపోవడంతో దేశానికి పెద్ద ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. బిల్లు వీగిపోవడం రాజకీయ ఓటమి కాదని, బీజేపీ విధానాలకు జరిగిన ఓటమి అని అభివర్ణించారు.
ఎన్డీయే మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసిందని ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకుంటామని అన్నారు. మహిళా రిజర్వేషన్లను చిన్న సవరణలతో అమలు చేయవచ్చని అన్నారు. బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi