
హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)
నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... కాంగ్రెస్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. బయట 'దక్షిణాది గౌరవం' అంటూ డ్రామాలు ఆడే విపక్షాలు, పార్లమెంటులో మాత్రం ఆ ప్రాంత గొంతు నొక్కేలా వ్యవహరించడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని సంజయ్ మండిపడ్డారు.
2026 తర్వాత జరగబోయే పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందని, దానిని అడ్డుకునేందుకే ప్రధాని మోదీ ఈ 'రక్షణ కవచం' లాంటి బిల్లును తెచ్చారని బండి సంజయ్ వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది సీట్లను 50 శాతం పెంచేందుకు సిద్ధమని స్పష్టమైన హామీ ఇచ్చినా విపక్షాలు స్పందించకపోవడం దారుణమన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే ఈ చారిత్రక సంస్కరణను అడ్డుకుని, దక్షిణాది ప్రజలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరగబోయే సీట్ల కోతకు విపక్షాలే బాధ్యత వహించాలని, ఈ ద్రోహాన్ని ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi