
గోదావరిఖని, 18 ఏప్రిల్ (హి.స.)
పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడంపై గోదావరిఖనిలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటనే అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ధర్నా సమయంలో మహిళలు కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని, మహిళా బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో గోదావరిఖనిలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం అనేక ఆందోళన, పోరాటాలు కొనసాగుతాయని బీజేపీ మహిళా నాయకులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు