భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు
భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు
భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు


న్యూఢిల్లీ, 19 ఏప్రిల్ (హి.స.)

వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం, ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఆయన్ను పిలిపించి, ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.

ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) బలగాలు, భారత జెండాతో ప్రయాణిస్తున్న ఓ భారీ ముడి చమురు ట్యాంకర్పై కాల్పులు జరిపాయి. అయితే, ఈ ఘటనలో ట్యాంకర్తో పాటు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) కూడా ధృవీకరించింది. ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగిందని, ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఐఆర్జీసీ గన్బోట్లు కాల్పులు జరిపాయని పేర్కొంది. ఇదే ప్రాంతంలో ఓ కంటైనర్ షిప్పై కూడా గుర్తు తెలియని వస్తువుతో దాడి జరిగిందని యూకేఎంటీఓ మరో ప్రకటనలో తెలిపింది.

మరోవైపు, హర్మూజ్ జలసంధిపై తిరిగి తమ పూర్తి నియంత్రణను పునరుద్ధరించుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా తమ నౌకలపై అక్రమంగా ఆంక్షలు విధిస్తోందని ఆరోపించింది. ఈ ఆంక్షలు తొలగించే వరకు జలసంధిపై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరాన్ ప్రకటన తర్వాత సుమారు 10 నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించకుండా వెనుదిరిగినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ డేటా వెల్లడించింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande