
డిల్లీ, 19 ఏప్రిల్ (హి.స.)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 12 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేని నిరాశ, నిస్పృహలతో ప్రధాని మోదీ ఉన్నారని, జాతిని ఉద్దేశించి చేసే అధికారిక ప్రసంగాన్ని పూర్తిగా రాజకీయ ప్రసంగంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి విపక్షాలపై బురదజల్లారని, పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన అవమానమని ఖర్గే అభివర్ణించారు.
మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ను 59 సార్లు ప్రస్తావించి, మహిళల గురించి కేవలం కొన్నిసార్లు మాత్రమే మాట్లాడారని, దీన్నిబట్టే ఆయన ప్రాధాన్యతలు ఏమిటో దేశానికి అర్థమవుతోందని ఖర్గే అన్నారు. బీజేపీకి మహిళలు కాదని, కాంగ్రెస్ మాత్రమే ప్రాధాన్యమని, ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడూ చరిత్రకు సరైన వైపు నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చిందని, 2010లోనే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసిందని గుర్తుచేశారు. కానీ బీజేపీ దాన్ని లోక్సభలో పాస్ చేయించలేకపోయిందని విమర్శించారు.
2023లో బీజేపీ తెచ్చిన కొత్త బిల్లుకు కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, కానీ ఆ బిల్లును నోటిఫై చేయడానికి బీజేపీకి మూడేళ్లు పట్టడం 'నారీ శక్తి' పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi