
హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని, నాలుగు వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థను, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, ఇది కాలయాపన చేసే వ్యూహం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులు లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 అంశాలపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, వాటిని వెంటనే పరిష్కరించవచ్చని తెలిపారు. మిగిలిన ఆర్టీసీ విలీనం, యూనియన్ల గుర్తింపు వంటి అంశాలు సాంకేతిక పరమైనవని, వీటిపై లోతైన పరిశీలన అవసరమని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi