
సంగారెడ్డి, 28 ఏప్రిల్ (హి.స.)
బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, నేనే రాజు.. నేనే మంత్రి అని అంటున్న రేవంత్రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళసంగారెడ్డి జిల్లా కంది జైలులో బీఆర్ఎస్ నేత క్రీశాంక్ను హరీశ్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి జైలులో పెట్టారని మండిపడ్డారు. ఫేక్ సర్క్యులర్ అని అన్నందుకు క్రీశాంక్ను జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్కు వంతపాడుతున్న అధికారులను వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా హరీశ్ రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ అధికారులు కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనేది కల్ల మాత్రమేనన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్ రెడ్డి వంద కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తారో లేదో సీఎం తేల్చాలని ఐదారు కిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని నిలదీశారు. రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ ఫ్లవర్ కొనే నాథుడే లేడని మీ మంత్రులు నిద్రపోతున్నారా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..