
కరీంనగర్, 28 ఏప్రిల్ (హి.స.)
గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా ఐదుగురు రైతులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి ఓట్ల తొలగింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు సూచించారు. సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ భవనంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామాల వారీగా పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకోవాల్సిన కార్యాచరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వచ్చే వర్షాకాలంలో ప్లాంటేషన్ నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. సైదాపూర్ మండలాన్ని ఒక మెడికల్ కాలేజ్ దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మండలంలో రోడ్లు, బ్రిడ్జ్లకు సాంక్షన్ అయ్యి పనులు ప్రారంభం కానివి త్వరగా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని, గ్రామాల్లో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..