
హైదరాబాద్, 28 ఏప్రిల్ (హి.స.)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) కి తెలంగాణ హైకోర్టు (High Court)లో మంగళవారం భారీ ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డి, తనపై నమోదైన కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. దీంతో ఇవాళ ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది.
కాగా, మార్చి 14న రాత్రి మొయినాబాద్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పోలీసులు రెయిడ్ చేశారు. పార్టీలో అందరూ డ్రగ్స్, మద్యం తీసుకున్నట్లుగా గుర్తించారు. పోలీసులపై ఫామ్ హౌస్లో కాల్పులు జరిపినట్లుగా మొహినాబాద్ పోలీస్ స్టేషన్ SI నయిమ్ద్దీన్ ఫిర్యాదు చేశారు. వారి నుంచి జర్మనీ తయారీ చెందిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఒక లైవ్ రౌండ్, నాలుగు ఖాళీ కార్టిడ్జ్లు సీజ్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. భారీగా విదేశీ మద్యం బాటిళ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జూలియో, రాయల్ సల్యూట్, చీవాస్, బెల్వెడేర్ వోడ్కా సీజ్ చేశారు. పార్టీకి హాజరైన 10 మంది పురుషులు, ఒక మహిళపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..