
హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోసుమారు 100 మంది పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లను అధికారులు రద్దు చేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా సెమినార్ సమర్పించనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
2023 మార్చిలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తమ డిజైన్ సెమినార్ ను నిర్దేశిత సమయంలోగా సమర్పించాల్సి ఉంది. అయితే గడువు ముగిసినప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి చేయని సుమారు 100 మంది విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని రిజిస్టర్ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రద్దైన వారిలో అత్యధికులు పార్ట్-టైం కేటగిరీకి చెందిన విద్యార్థులే ఉన్నారు.
అడ్మిషన్ల రద్దు నిర్ణయం పై పరిశోధక విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెమినార్ గడువుకు సంబంధించి తమకు సరైన సమాచారం అందలేదని, కేవలం సమాచార లోపం వల్లే ఈ జాప్యం జరిగిందని వారు పేర్కొంటున్నారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, మరో 15 రోజుల గడువు ఇవ్వాలని విద్యార్థులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
యూనివర్సిటీ అకడమిక్ నిబంధనల ప్రకారం అడ్మిషన్ పొందిన ఏడాది లోపు డిజైన్ సెమినార్ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ క్రమంలోనే స్టాండింగ్ కమిటీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో అడ్మిషన్లు రద్దు కావడంతో, మానవీయ కోణంలో అధికారులు స్పందిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు.
పరిశోధక విద్యార్థుల అడ్మిషన్ల రద్దు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామని జార్జిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు డా. ఎస్. నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..