
ఖమ్మం, 30 ఏప్రిల్ (హి.స.)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫారెస్ట్ప్రాంతంలో అరుదైన అడవి దున్నలు ( ఇండియన్ బైసన్లు ) దృశ్యాలు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. వేసవి కాలం కావడంతో ఎండలు తీవ్రత పెరిగి చిన్న చిన్న నీటి కుంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దట్టంగా ఉన్న అడవుల్లో ఉండే అడవి దున్నలు నీటి కొలనులు వద్దకు వచ్చి దాహార్తిని తీర్చుకుంటున్నాయి. సత్తుపల్లి మండలం చంద్రాయ పాలెం, రేగళ్ల పాడు, యాతాల కుంట, చెరుకు పల్లి గ్రామాల పరిధిలోని దట్టమైన అడవి ప్రాంతంలో యథేచ్చగా జీవిస్తున్న అరుదైన ఇండియన్ బైసన్లు అప్పుడప్పుడు అటుగా వెళ్ళే వాహనదారులకు, స్థానికుల కంటికి కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం చంద్రాయ పాలెం వద్ద ఒక నీటి కొలను వద్దకు అడవి దున్నలు గుంపు చేరుకుని ఎండల తీవ్రతకు దాహార్తి నీ తీర్చుకుంటున్న దృశ్యాలు కనువిందు చేశాయి. సత్తుపల్లి ప్రాంతం అడవులు అభివృద్ధి చెందడంతోనే వన్య ప్రాణులకు ఆవాసాలు గా ఏర్పడ్డాయని, ఈ ప్రాంతం అడవులు పర్యావరణానికి అనువుగా మారి జీవ వైవిధ్యానికి అద్దం పడుతుందని అటవీ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు