
హైదరాబాద్, 07 ఏప్రిల్ (హి.స.)ఈ ఐపీఎల్ సీజన్లో మంగళవారం ముంబయి, రాజస్థాన్ జట్లు (Mumbai vs Rajasthan) తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వర్సెస్ ముంబయి పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కాంబినేషన్ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా ముంబయి బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాట్లాడాడు. వైభవ్ (Vaibhav Sooryavanshi) ఆట తమకు కొత్తేం కాదన్నాడు.
‘‘ఐపీఎల్ (IPL 2026)లో వైభవ్కు ఇది రెండో సీజన్. చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆ ఫ్రాంచైజీకి అతడు విలువైన ఆటగాడు. అందులో సందేహం ఏమీ లేదు. అయితే, అతడి ఆటతీరు మాకు కొత్తేం కాదు. వైభవ్ విషయంలో ముంబయి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇతర ఆటగాళ్లను ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధమవుతామో వైభవ్ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తాం’’ అని పరాస్ తెలిపాడు.
ఇక, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ గురించి కూడా తమకు చింత లేదని ముంబయి కోచ్ పేర్కొన్నాడు. ‘‘రవిని మిస్టరీ స్పిన్నర్ అని మేం భావించట్లేదు. గత కొన్నేళ్లుగా ఎలా బౌలింగ్ చేస్తున్నాడో.. ఈ ఏడాది అలాగే ఉంది. అయితే మైదానంలో ఏదైనా జరగొచ్చు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మా జట్టు సిద్ధమే’’ అని వెల్లడించాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లో గెలిచి రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అటు ముంబయి రెండు మ్యాచ్లు ఆడగా.. ఒకదాంట్లో ఓటమిపాలై ఆరో స్థానంలో ఉంది. ఇక, చెన్నైపై మ్యాచ్లో వైభవ్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్