
వేములవాడ, 07 ఏప్రిల్ (హి.స.)
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో మంగళవారం రైతులకు రాజన్న కోడెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్తో కలిసి రైతులకు కోడెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు స్వామివారికి కోడెమొక్కు చెల్లించే సంస్కృతి ఉందని, అనేకమంది భక్తులు తమ కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత స్వామివారికి కోడెలను సమర్పిస్తారని అన్నారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి రాజన్న కోడెలను రైతులకు ఉచిత పంపిణీ చేస్తున్నామని, రాజన్న ప్రసాదంగా స్వీకరించిన కోడెలను రైతులు వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగిస్తూ వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు.
రైతులు తీసుకున్న కోడెలను అధికారులు అప్పుడుడప్పుడు తనిఖీ చేసి వాటి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారని, రైతులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోడెల సంరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో గోశాలలో షెడ్డు నిర్మాణం, సీసీ వంటి అన్ని వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే 40 ఎకరాల్లో అధునాతన గోశాల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు