
ఖమ్మం, 07 ఏప్రిల్ (హి.స.) ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్, స్థానిక వెంకటేశ్వర నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ల్యాబ్, మెడికల్ వార్డ్, టాయిలెట్లు, శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమైన ఔషధాల లభ్యతపై ప్రత్యేకంగా విచారించి, అన్ని రకాల అవసరమైన మందులను తగిన స్థాయిలో నిల్వ ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రి రిజిస్టర్లన్నింటినీ స్వయంగా పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై వివరాలను కలెక్టర్ అనుదీప్ అడిగి తెలుసుకున్నారు.
ల్యాబ్ పరీక్షలు, డయాగ్నస్టిక్ హబ్ సేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అన్ని పరీక్షల రిపోర్ట్ లను వీలైనంత త్వరగా రోగులకు అందించాలని ఆదేశించారు. రోగులకు సమయానికి సరైన చికిత్స అందించడంతో పాటు అవసరమైన అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచి, రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అన్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు