
కలకత్తా, 01 మే (హి.స.)
బంగాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఖండించారు. మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూములు, ప్రవేశ ద్వారాలు సహా అన్ని కీలక ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
కౌంటింగ్ ప్రక్రియ 100 శాతం నిబంధనలకు అనుగుణంగా, అత్యంత కచ్చితత్వంతో జరుగుతుందని సీఈఓ హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ప్రతి రౌండ్ లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. అయితే కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు నిలిపివేశారని, లెక్కింపులో పారదర్శకత లోపించిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, అలాంటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.
ఎన్నికల ప్రక్రియపై ప్రజలు, రాజకీయ పార్టీలు పూర్తి విశ్వాసం ఉంచాలని సీఈఓ కోరారు. పారదర్శకత, నిష్పక్షపాతతకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని, ప్రతి ఓటు విలువను కాపాడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. కోల్కతాలోని ఖుదిరామ్ అనుషీలన్ కేంద్రంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు ఉన్నాయని అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, సాధారణ పరిశీలకుల సమక్షంలో వాటిని మూసివేసి సీల్ చేసినట్లు వెల్లడించారు. చివరి స్ట్రాంగ్ రూమ్ను గురువారం(30-04-2026) ఉదయం సుమారు 5.15 గంటలకు సీల్ చేసినట్లు పేర్కొన్నారు.
బ్యాలెట్ల కోసం ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్
కాగా అదే ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్) ద్వారా వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను అసెంబ్లీ వారీగా వర్గీకరించే ప్రక్రియ మాత్రమే జరుగుతోందని వివరించారు. ఈ ప్రక్రియను ప్రధాన స్ట్రాంగ్ రూముల వెలుపల కారిడార్లో నిర్వహించారని స్పష్టం చేశారు.
ఈ-మెయిల్ ద్వారా సమాచారం
దీని గురించి రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) అన్ని రాజకీయ పార్టీలకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లకు కూడా దీనిపై ముందుగానే తెలియజేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై సంబంధిత పార్టీల ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరిచిందని టీఎంసీ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్య హత్యతో సమానమని విమర్శించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను కూడా ఆ పార్టీ విడుదల చేసింది.
ఇండోర్ స్టేడియం వెలుపల ధర్నా
టీఎంసీ సీనియర్ నేతలు శశి పాంజా, కునాల్ ఘోష్ నేతాజీ ఇండోర్ స్టేడియం వెలుపల ధర్నాకు దిగారు. స్ట్రాంగ్ రూమ్లో తమ ప్రతినిధులను అనుమతించడం లేదని, పోస్టల్ బ్యాలెట్లతో చెలగాటమాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. పారదర్శకత లోపించిందని ఆరోపించారు. తరువాత ధర్నాను విరమించిన కునాల్ ఘోష్, స్ట్రాంగ్ రూమ్ సీల్ను ముందస్తు సమాచారం లేకుండా తెరవడం ఎన్నికల సంఘం తప్పిదమని అన్నారు.
అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు
ఇకపై అధికారిక సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ సీల్ను తెరవమని ఈసీ హామీ ఇచ్చిందని తెలిపారు. అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరగా, అందుకు కూడా అధికారులు అంగీకరించినట్లు చెప్పారు. అయితే టీఎంసీ ఓటమికి ముందుగానే కారణాలు వెతుక్కుంటూ వదంతులు వ్యాప్తి చేస్తోందని బీజేపీ నేత తపస్ రాయ్ విమర్శించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడు స్థాయిల భద్రత ఉందని, తమ తరఫున కూడా ఇద్దరు ప్రతినిధులను పర్యవేక్షణకు నియమిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi