
తిరువనంతపురం 14 మే (హి.స.)
కేరళ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు దీప్దాస్ మున్షీ, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో కేరళ కాంగ్రెస్లో ఒక తరం మారిపోయిందని, కొత్త శకం ఆరంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం రేసులో ఉన్న సీనియర్ నేత రమేశ్ చెన్నితాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి, సతీశన్ను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా రాహుల్ సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రోజుల తరబడి సాగిన తీవ్రమైన లాబీయింగ్, చర్చల తర్వాత హైకమాండ్ సతీశన్ వైపే మొగ్గు చూపింది.
కొచ్చి జిల్లాకు చెందిన 62 ఏళ్ల సతీశన్, వృత్తిరీత్యా న్యాయవాది. 2001లో పారావూర్ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన వాగ్ధాటి, గణాంకాలతో కూడిన ప్రసంగాలతో అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడంలో ఆయనకు మంచి పేరుంది. కేరళ కాంగ్రెస్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన 'ఏ', 'ఐ' వర్గాలకు అతీతంగా ఉండటం ఆయనకు కలిసివచ్చింది. ఇది యువ నాయకులను, కార్యకర్తలను ఆయన వైపు ఆకర్షించింది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘోర పరాజయం తర్వాత అనూహ్యంగా ప్రతిపక్ష నేతగా ఎంపికైన సతీశన్, ఆ పదవిని తన రాజకీయ ఎదుగుదలకు సోపానంగా మార్చుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, ఏఐ కెమెరాల ఆరోపణల వంటి అంశాలపై పినరయి విజయన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వామపక్ష వ్యతిరేక రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.
ఇప్పుడు ప్రతిపక్ష నేత స్థానం నుంచి ముఖ్యమంత్రి కుర్చీకి మారబోతున్న సతీశన్పై భారీ అంచనాలున్నాయి. కేవలం ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా ఎన్నికల పరాజయాలతో నిస్తేజంగా మారిన పార్టీకి కొత్త ఊపునిచ్చి, వామపక్షాల ప్రాబల్యాన్ని ఎదుర్కోవాల్సిన పెద్ద బాధ్యత ఆయనపై ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi