
జడ్చర్ల, 15 మే (హి.స.)
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపాయి. మున్సిపల్ కార్యాలయంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, పలు ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ అధికారులు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నయి. కార్యాలయంలో పలు విభాగాల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పలు బిల్లులు, ఇండ్ల అనుమతుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు కార్యాలయంలోని సిబ్బందిని పలు రకాల ప్రశ్నలతో విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయం కాంట్రాక్టర్ వద్ద నుండి 50 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీన పరుచుకున్నట్లు సమాచారం. ఈ నగదు ఎక్కడిది? మున్సిపల్ కార్యాలయానికి ఎలా వచ్చింది? ఈ నగదు తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
ఇంకా మున్సిపల్ అధికారుల తనిఖీలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, గత కొంతకాలం నుండి అనేక అవినీతి ఆరోపణలు మున్సిపల్ కార్యాలయంపై వెలువడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతుండడంతో పలు నిర్మాణాల అనుమతుల కొరకు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పలువురు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పలువురు లసుగులను ఉపయోగించుకొని ముడుపులు చెల్లించి నిర్మాణాల అనుమతులు పొందిన వారు లోలోనే గుబులు చెందుతున్నారు. ఏదేమైనా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు తనిఖీలు జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు