వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్, డీజిల్పై రూ. 3 పెంపు
వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్, డీజిల్పై రూ. 3 పెంపు
petrol


ఢిల్లీ, 15 మే (హి.స.)

దేశవ్యాప్తంగా వాహనదారులకు భారీ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుక్రవారం నుంచి భారీగా పెంచాయి. లీటర్కు సుమారు రూ.3 మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నేటి (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77 నుంచి రూ.97.77కు చేరగా, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.90.67కు పెరిగింది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.74, ముంబైలో రూ.106.68, చెన్నైలో రూ.103.67కు చేరింది. అదేవిధంగా డీజిల్ ధరలు కోల్కతాలో రూ.95.13, ముంబైలో రూ.93.14, చెన్నైలో రూ.95.25కి చేరాయి. నగరాలను బట్టి ఈ పెంపు రూ.2.83 నుంచి రూ.3.29 వరకు ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత చమురు ధరలను ఈ స్థాయిలో సవరించడం ఇదే తొలిసారి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 105 డాలర్ల మార్కును దాటడంతో, దాని భారాన్ని తగ్గించుకునేందుకు చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మీదుగా జరిగే ఇంధన రవాణాకు ఎదురవుతున్న సవాళ్లపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

బ్రెంట్ క్రూడ్ ధర 105 డాలర్లు దాటితే మే 15 తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ మనోరంజన్ శర్మ ముందే అంచనా వేసిన విషయం తెలిసిందే. తాజా పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande