మానవ అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం... 120 మంది చిన్నారులకు విముక్తి!
మానవ అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం... 120 మంది చిన్నారులకు విముక్తి!
మానవ అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం... 120 మంది చిన్నారులకు విముక్తి!


ఢిల్లీ, 15 మే (హి.స.)

మానవ అక్రమ రవాణాపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఉక్కుపాదం మోపింది. గత ఏప్రిల్ నెలలో ‘నన్హే ఫరిస్తే’ పేరుతో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో భాగంగా 120 మంది చిన్నారులను అక్రమార్కుల చెర నుంచి సురక్షితంగా కాపాడింది. వీరిలో 96 మంది బాలురు, 24 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రక్షించిన చిన్నారులందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి (సీడబ్ల్యూసీ) అప్పగించారు.

ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఆర్పీఎఫ్ నిర్వహించిన వివిధ భద్రతా కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను సాధించాయని ఆయన తెలిపారు. ‘ఆపరేషన్ ఆహాత్’లో భాగంగా మరో ఐదుగురు బాలురను రక్షించి, ఇద్దరు మానవ అక్రమ రవాణాదారులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

అదేవిధంగా, ‘యాత్రి సురక్ష’ ఆపరేషన్ ద్వారా 79 మంది నేరస్థులను అదుపులోకి తీసుకుని 71 కేసులు నమోదు చేశామన్నారు. వారి నుంచి రూ.54.52 లక్షల విలువైన దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులను తిరిగి అందించే ‘ఆపరేషన్ అమానత్’ కింద రూ.83.35 లక్షల విలువైన 319 వస్తువులను గుర్తించి యజమానులకు అప్పగించారు.

ఇక, ‘నార్కోస్’ ఆపరేషన్లో భాగంగా మత్తుపదార్థాల రవాణాను అడ్డుకుని, రూ.86.17 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనలో 16 మంది నిందితులను అరెస్టు చేసి, తదుపరి చర్యల నిమిత్తం జీఆర్పీకి అప్పగించినట్లు శ్రీధర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande