
యాదాద్రి భువనగిరి, 16 మే (హి.స.)
గ్యాస్ కోసం వినియోగదారులు రెండవ రోజు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ భారత్ గ్యాస్ ఏజెన్సీ గత కొన్ని రోజులుగా వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని వారు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన వినియోగదారులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు శనివారం కూడా ఉదయాన్నే గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకొని వినియోగదారులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్యాస్ ఇప్పిస్తామంటూ రోడ్డుపై బైఠాయించిన వినియోగదారులను పక్కకు జరిపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గృహ వినియోగదారులకు సిలిండర్లు ఇవ్వకుండా హోటల్ యజమానులకు ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ను ఇస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీకి వస్తున్న సిలిండర్లు ఎక్కడికి డెలివరీ అవుతున్నాయో ఉన్నతాధికారులు లెక్క తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు