అంతర్రాష్ట్ర మొబైల్ చోరీ ముఠా ను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
అంతర్రాష్ట్ర మొబైల్ చోరీ ముఠా ను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
Police


హైదరాబాద్, 16 మే (హి.స.)

మొబైల్ ఫోన్ చోరీలు, జేబు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేర ముఠాను కంచన్బాగ్ పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తుతో అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక విశ్లేషణ, ఫీల్డ్ స్థాయి సమాచారంతో నడిపిన ఆపరేషన్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లు, విడిభాగాలు, ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గత నెల డీఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన ఖరీదైన మొబైల్ ఫోన్ స్నాచింగ్తో వెలుగులోకి వచ్చింది. సయ్యద్ నజీర్ అహ్మద్ వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ5 మొబైల్ ఫోన్ను అపహరించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కంచన్బాగ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో నిందితుల కదలికలను సీసీ కెమెరాల ద్వారా విశ్లేషించడంతో పాటు, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలను పరిశీలించి ముఠా కార్యకలాపాలను వెలికితీశారు. ఈ ముఠా హైదరాబాద్, సికింద్రాబాద్లో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిలో సందీప్ జైస్వాల్ దొంగిలించిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి విక్రయించే కీలక రిసీవర్గా వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు. తోట వసంత్, శశి, ప్రేమ్ తదితరులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసుల విచారణలో ఈ ముఠా బస్టాండ్లు, మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రద్దీ రోడ్ల వద్ద ప్రజలను లక్ష్యంగా చేసుకునేదని తేలింది.

దొంగిలించిన ఫోన్లను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయించేవారని, కొన్ని ఫోన్లను విడదీసి బ్యాటరీలు, కెమెరాలు, ఇతర విడిభాగాలుగా మార్చి మొబైల్ రిపేర్ దుకాణాలకు అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 132 మొబైల్ బ్యాటరీలు, 172 మొబైల్ బాడీలు, 73 కెమెరా మాడ్యూల్స్, ఆపిల్ ఐఫోన్, ఓన్ప్లస్ స్మార్ట్ఫోన్స్, వివో స్మార్ట్ఫోన్స్, శాంసంగ్ గెలాక్సీ తదితర బ్రాండ్లకు చెందిన అనేక మొబైల్ ఫోన్లు, ఒక బజాజ్ పల్సర్ బైకు ఉన్నాయి. అరెస్టైన నిందితుల్లో చాలా మంది పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక చోరీ, మోసం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande