బుల్లెట్ బండి పై మంత్రి జూపల్లి.. ప్రభుత్వ ఆస్పత్రులు ఆకస్మిక తనిఖీలు
బుల్లెట్ బండి పై మంత్రి జూపల్లి.. ప్రభుత్వ ఆస్పత్రులు ఆకస్మిక తనిఖీలు
Minister


నాగర్ కర్నూల్, 16 మే (హి.స.)

మంత్రి జూపల్లి కృష్ణారావు

శనివారం బుల్లెట్ బైక్ నడుపుతూ కొల్లాపూర్ పట్టణంలో ఏరియా ఆస్పత్రికి వెళ్ళారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు గూర్చి రోగులతో మంత్రి స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రతి రోజూ డాక్టర్లు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారా! లేదా! ఇక్కడ ఎవ్వరూ సూపరింటెండెంట్ అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. తానేనంటూ చెబుతూ డాక్టర్ శ్రీనివాస్ మంత్రి ముందుకు వచ్చారు.రెండు ఆస్పత్రులకు సూపరింటెండెంట్ మీరొక్కరేనా! అంటూ ఆలాగైతే కష్టమని మంత్రి జూపల్లి,సూపరింటెండెంట్ శ్రీనివాస్ తో అన్నారు. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ నుంచి మంత్రి బుల్లెట్ బైక్ పై తిరిగి పెంట్లవెల్లి రోడ్డులో ఉన్న మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా తో మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో రూ.22 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించామని, ప్రస్తుతం అన్ని పనులు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నందున త్వరలోనే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తో ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందుగా మిగిలిన చిన్నచిన్న పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు. డయాలసిస్ సెంటర్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేసినట్లు, నేటి నుంచి పూర్తిస్థాయి విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మంత్రి జూపల్లి తెలిపారు. అదనపు అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు, డయాలసిస్ సెంటర్లో మరిన్ని బెడ్లు మరియు అదనపు ఏసీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

రోగులకు అందిస్తున్న భోజన ఏర్పాట్ల పై కూడా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో, స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా భోజన ఏర్పాట్ల బాధ్యతలను స్థానికులకే అప్పగించాలని మంత్రి జూపల్లి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ జీవీ హేమంత్ కేశవ్ పాటిల్ తో ఫోన్లో మాట్లాడారు. డయాలసిస్ రోగులు బస్సు కోసం వేచి ఉండడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, ఆసుపత్రి వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు తరచూ హాస్పిటల్ను సందర్శిస్తూ రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande