
ఖమ్మం, 17 మే (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ
ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ ప్రత్యేక చొరవతో ఏన్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఏర్పాటు చేయడానికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ పాఠశాలను స్వయంగా పరిశీలించి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు విద్య కోసం ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించాల్సి వస్తుండగా, అధిక ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఏన్కూర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం కూడా తగ్గే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న డిసెంబర్ నాటికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలిసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు