
రాజన్న సిరిసిల్ల, 17 మే (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం కేంద్రంలోని వట్టిమల్ల గ్రామాల్లో ఆదివారం రైతన్నలు ఒక్కసారిగా ఆగ్రహించి రోడ్డెక్కారు. లారీలు రాకపోవడంతో గ్రామంలోని రైతన్నలు, బీఆర్ఎస్, టీఆర్పీ పార్టీల నాయకులతో కలిసి రోడ్డుపై ధాన్యం బస్తాలను పోసి బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు ఇంత ఆలస్యం కాలేదని, ఎప్పటికప్పుడు లారీలు వచ్చి ధాన్యాన్ని తరలించారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అనే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కు శుభకార్యాలకు, విందు వినోదాల పర్యటలను సమయం ఉంటుంది గానీ, రైతన్నల బాధలను తొలగించడానికి కొనుగోలు కేంద్రాలను సందర్శించడానికి సమయం దొరకడం లేదా అని అన్నారు.
ఒక వైపు వాతావరణం ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియక రైతన్నలు బిక్కు బిక్కుమంటే, అధికారంలో ఉండి లారీల సమస్యను తీర్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. కొనుగోలు కేంద్రాలను అంగులు, ఆర్భాటాలతో ప్రారంభించినప్పటికీ వాటి నిర్వహణ పట్టించుకోవడం లేదని వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా మా ఊరిలో కనీసం 10 కుప్పల ధ్యానాన్ని కూడా తరలించకపోయారు అని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పేరుకుపోయిన ధాన్యం రాశులు ఎండ, వానలకు తడుస్తూ, ఎండుతూ తేమ శాతం తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అన్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొని మీకు ప్రజల బాధలను పట్టడం లేదు అని అన్నారు. ఇప్పటికైనా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని లారీల కొరతను నివారించాలని కోరారు. లేనియెడల రానున్న రోజుల్లో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసున్న కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడించి రైతులకు నచ్చజెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు