మహిళలకు నెలకు రూ.3,000.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం.. జూన్ 1 నుంచి సంక్షేమ పథకాల అమలు
మహిళలకు నెలకు రూ.3,000.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం.. జూన్ 1 నుంచి సంక్షేమ పథకాల అమలు
Suvendu Adhikari


కలకత్తా, 18 మే (హి.స.)

ఇటీవలే పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో హామీ మేరకు కొన్ని పథకాల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ రాజధాని కోల్కతాలో సోమవారం సీఎం సువేందు అధికారి ఆధ్వర్యంలో రెండోసారి క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో.. జూన్ 1 నుంచి పలు పథకాల అమలు చేయాలని నిర్ణయించారు. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఐదు కీలక అంశాలపై చర్చ జరిపి, ఆమోదం తెలిపారు.

దీని ప్రకారం.. వచ్చే జూన్ 1 నుంచి ‘అన్నపూర్ణ’ పథకం అమలు చేస్తారు. అర్హులైన మహిళలకు ఈ పథకం కింద నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు జూన్ 1 నుంచి ఉచిత ప్రవేశం కల్పిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, సీఏఏ చట్టం కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తామని బెంగాల్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు.

ఇప్పటికే అమలవుతున్న లక్షీ భండార్ పథకం లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయకుండానే అన్నపూర్ణ పథకానికి అర్హత పొందుతారని మంత్రి చెప్పారు. ఇంకా ఈ పథకం పొందలేని వారు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే కొత్త పోర్టల్ ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మరోవైపు మతపరమైన సంక్షేమ పథకాల్ని, ప్రోత్సహకాల్ని జూన్ 1 నుంచి రద్దు చేయబోతున్నట్లు తెలిపారు. దీని ప్రకారం మదర్సాలకు అందించే సాయం ఆగిపోయే అవకాశం ఉంది.

అలాగే, ఓబీసీలకు అందించే పథకాల అమలుకు కొత్త కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయనుంది. కేంద్రంతో కలిసి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఇటీవలే సువేందు అధికారి ప్రభుత్వం ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande