దేశంలో ప్రకంపనలు రేపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. సోషల్ మీడియాలో డిజిటల్ తిరుగుబాటు!
దేశంలో ప్రకంపనలు రేపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. సోషల్ మీడియాలో డిజిటల్ తిరుగుబాటు!
Cockroach


హైదరాబాద్, 27 మే (హి.స.)

భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) అనే ఒక సరికొత్త సోషల్ మీడియా ఉద్యమం పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో జర్నలిస్టుల మనుగడను పిడుగులకైనా తట్టుకునే బొద్దింకలతో పోల్చేవారు. కానీ నేడు అదే బొద్దింక అధికార పీఠాలపై నిరసన తెలపడానికి యువతకు ఒక బలమైన రాజకీయ చిహ్నంగా మారింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడి, ప్రతిపక్షాలు చేష్టలుడిగిన వేళ.. ఈ శూన్యంలోంచి ఒక సరికొత్త డిజిటల్ తిరుగుబాటు పుట్టుకొచ్చింది.

అమెరికా యూనివర్సిటీలో ఉండే ఒక సాధారణ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఈ వ్యంగ్య ఉద్యమం.. ఇటు అధికార శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ‘బొద్దింక’ వ్యాఖ్యలే ఈ తిరుగుబాటుకు కారణమయ్యాయి. తమను హేళన చేసినట్లు భావించిన లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరిట నెట్టింట ఒక్కటయ్యారు. విచిత్రమేమిటంటే.. ఈ సీజేపీకి ఎలాంటి ఆఫీసు, లీడర్, క్యాడర్ లేవు. కేవలం సైబర్ ప్రపంచంలో సాగుతున్న ఈ ఉద్యమాన్ని చూసి కేంద్రం ఎందుకు ఉలిక్కిపడుతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వం ప్రకటనల ద్వారా నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చి తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. కానీ ఈ ‘ఇంటర్నెట్ బొద్దింకలు’ ప్రభుత్వ స్క్రిప్ట్ను తిరస్కరిస్తూ వాస్తవాలను బయటపెడుతున్నారు.

యువత అశాంతి: దేశంలో విద్యార్థులు, యువత ఉద్యోగాలు లేక తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారు. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రవేశానికి యువత బ్రహ్మరథం పట్టడమే ఇందుకు నిదర్శనం. యువత ఇప్పుడు పాత రాజకీయాలను కాదని, సోషల్ మీడియా మీమ్స్ ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

వ్యంగ్యం అనే ఆయుధం:నిరంకుశ ప్రభుత్వాలు విమర్శలనైనా తట్టుకోగలవు కానీ, హేళనను తట్టుకోలేవు. కార్టూనిస్టులు, యూట్యూబర్లపై ప్రభుత్వాలు కక్షగట్టడానికి కారణం ఇదే. మీమ్స్ ద్వారా సాగుతున్న ఈ నవ్వుల దాడి పాలకుల ఇమేజ్ను దెబ్బతీస్తోంది.

దీంతో కేంద్ర మంత్రులు దీనిపై 'విదేశీ కుట్ర' అని, దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. విమర్శలను దేశద్రోహంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ప్రతిపక్షాలకు కూడా ఇదొక హెచ్చరిక. యువత ఆగ్రహాన్ని కేవలం మీమ్స్కే పరిమితం చేయకుండా ఓట్లుగా మార్చగల సరైన కార్యాచరణ ప్రతిపక్షాల వద్ద లేదు. గతంలో 1970లలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సాగిన నవనిర్మాణ ఉద్యమం నుంచి వచ్చినవారే నేటి పాలకులు. చరిత్ర నేర్పే పాఠం ఒక్కటే.. ఏ అధికారమూ శాశ్వతం కాదు. లీడర్, హెడ్క్వార్టర్స్ లేని, కోల్పోవడానికి ఏమీ లేని ఈ డిజిటల్ సైన్యాన్ని ఎదుర్కోవడం కేంద్రానికి ఒక పెద్ద సవాలుగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande