కాంగ్రెస్ వచ్చాక ఇండ్లు కూల్చుడు తప్ప.. కట్టుడు లేదు.. కేటీఆర్ ధ్వజం
కాంగ్రెస్ వచ్చాక ఇండ్లు కూల్చుడు తప్ప.. కట్టుడు లేదు.. కేటీఆర్ ధ్వజం
కేటీఆర్


హైదరాబాద్, 31 మే (హి.స)

కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప్పి రెండేళ్లు గడిచిపోయిందని.. కనీసం ఆరు ఇండ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. కనీసం ఆరు ఇటుకలు కూడా పేర్చలేదని అన్నారు.

కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టినమని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఇండ్లు కూల్చుడు తప్ప.. కట్టుడు లేదని విమర్శించారు. ఇదే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశానని తెలిపారు. కేసీఆర్ హయాంలో లక్ష బెడ్రూం ఇండ్లు కట్టినం.. మీరు ఒక్క ఇల్లు అయినా కట్టిండ్రా అని నిలదీసినా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కట్టిన వాటికంటే రెండింతలు కట్టకుంటే పోటీ చేయనని పొంగులేటి అంటున్నాడని తెలిపారు. ముందు ఆరు వేల ఇండ్లు కట్టిస్తానని చెప్పిన పొంగులేటి కనీసం ఆరు ఇండ్లయినా చూపించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వచ్చాక ఇండ్లు కూల్చుడు తప్ప.. కట్టుడు లేదని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా పేరుతో ఎంతమంది ఇళ్లను కూల్చారని ప్రశ్నించారు. జీవో నెం.58, 59 కింద కేసీఆర్ రెండున్నర లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఇన్ని నెలల పాలనలో ఒక్క పట్టా అయినా ఇచ్చినవా.. ఒక్క ఇల్లు కట్టినవా.. ఒక్క ఇటుక పేర్చినవా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మనం కట్టించిన ఫ్లైఓవర్లు, ఇళ్లను ప్రారంభించేందుకు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.

వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఎంత వస్తాదైనా మూడు నెలల్లో పిల్లలను పుట్టిస్తారా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని తెలిపారు. 30 నెలలైనా ఒక్క పథకం పుట్టించకపోయిన రేవంత్ రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలతో వరద పారిస్తే.. ఇప్పుడు హామీల బురద కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande