
మహబూబ్నగర్, 31 మే (హి.స.)
పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలు
నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చే సిబ్బందిని పోలీస్ స్టేషన్లోకి అనుమతించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్ను ఆదివారం ఎస్పీ డి.జానకి సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, ఎఫ్ఎఆర్ నమోదు విధానం, స్టేషన్ డైరీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, బీట్ బుక్స్, సీజ్ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్ఎస్ నమోదు విధానం, ఆన్లైన్ అప్డేట్స్ తదితర అంశాలను సమగ్రంగా ఎస్పీ పరిశీలించారు. ప్రతి కేసును సమయానుకూలంగా నమోదు చేసి సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎస్పీ సూచించారు.
రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ ఇచ్చిన ఆదేశాలను ఎస్పీ సిబ్బందికి వివరించారు. నిష్పక్షపాత విధులే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీజీపీ సూచించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ వంటి అంశాలను కూడా జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్న సిబ్బంది ప్రతి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి నేరుగా తనను కలవవచ్చని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..