
కర్నూలు, 31 మే (హి.స.)కర్నూలుతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
కర్నూలుతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ. 2,728 కోట్లను విడుదల చేసింది. రేపు జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల చేతికి ఆర్థిక భరోసా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.
కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లు
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులు పెన్షన్లను అందుకోనున్నారు. కొత్తగా 5,606 స్పౌజ్ (భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే) ఇచ్చే పింఛన్లను మంజూరు చేయనున్నారు. ఈ సరికొత్త స్పౌజ్ పెన్షన్ల కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీనివల్ల ఎంతోమంది అర్హులైన కుటుంబాలకు కొత్తగా ప్రభుత్వ ఆసరా లభించనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తోంది. ఇప్పటివరకు కేవలం పెన్షన్ల కోసమే ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ. 65,886.57 కోట్లను ఖర్చు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలబడుతోంది. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా వారి ముంగిటకే లబ్ధిని చేకూరుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV