గాలివాన బీభత్సం - పగలు ఉక్కపోత రాత్రికి దంచికొడుతున్న వర్షం
గాలివాన బీభత్సం - పగలు ఉక్కపోత రాత్రికి దంచికొడుతున్న వర్షం
గాలివాన


అనంతపురం, 31 మే (హి.స.)రాయలసీమా జిల్లాలో య వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటిపూట భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం వరుణుడు ఉపశమనం కలిగించాడు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనంతపురం, కర్నూలు, కడప, శ్రీసత్యసాయి జిల్లాలతో పాటు రాయలసీమావ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులలు పడ్డారు. పలుచోట్ల పిడుగుపాట్లు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.జాతీయ రహదారి ఫ్లైఓవర్పై విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు విరిగిపడటంతో హైవేపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది.

ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయ్యాయి.

తాడిపత్రి పట్టణ పరిసర ప్రాంతాల్లో రాత్రి ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో, నాగులకట్ట, కూరగాయల మార్కెట్, యల్లనూరు రోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, హరిజన వాడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల చెట్లు, విద్యుతస్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాత్రి 11గంటలు అవుతున్నా విద్యుత రాక పట్టణమంతా అంధకారంలో ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో కురిసిన వర్షానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. దేవళం బజారు నుంచి వచ్చిన నీరు రాజగోపురం గుండా లోపలికి ప్రవేశించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.

ఈదురుగాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షపు నీరు చేరి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లడంతో ఆ నీరంతా నివాసాల లోపలికి చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలు సాగించలేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande