
ఢాకా, 20 జూన్ (హి.స.)
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి హిందువులు కదంతొక్కారు. రాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం రాత్రి భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్, గైబంధ జిల్లాలోని పలాష్బరి కాంప్లెక్స్ దేవాలయ ప్రాంగణంలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీశ్రీ రాధా గోవింద దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహం నిర్మాణం జరుగుతోంది. రాముడి విగ్రహంతోపాటు కృష్ణుడు, శివుడి విగ్రహాల్ని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో రాముడి విగ్రహ నిర్మాణం అతిపెద్దది.
ఈ నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తైంది. అయితే, రాముడి విగ్రహాన్ని నిర్మించవద్దని అక్కడి ముస్లిం సంఘాలు, మత గురువులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ఈ విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేసింది. అలాగే, రాముడి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల కొన్ని ముస్లిం సంఘాలు నిరసన చేపట్టాయి. దీనిలో భాగంగా రాముడి చిత్ర పటాన్ని అవమానపరిచాయి.
ఢాకాలోని షాబాగ్ ఇంటర్సెక్షన్ నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ చేశారు. అనేక హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఢాకాలోని రిపోర్టర్స్ యునిటీ బిల్డింగ్ వద్ద కూడా మరికొందరు నిరసన చేపట్టారు. విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రాముడిని అవమానించి వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్ని మూడు రోజుల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
లేకుంటే దేశవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే, విగ్రహ ఏర్పాటు పూర్తి చేయకపోతే దేశంలోని అన్ని జిల్లాల్లో రాముడి ఆలయాలు కడతామని కూడా హెచ్చరించారు. అయితే, ఈ నిరసనల్ని కొన్నిచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత గందరగోళం తలెత్తింది. మరోవైపు కొత్తగా ఏర్పడ్డ తారిక్ రెహమాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో బంగ్లాదేశ్లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందని హిందూ సంఘాలు సహా పలు మైనారిటీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ముస్లిం మెజారిటీ దేశం కావడంతో ఇతర మతస్తులపై తరచూ దాడులు జరుగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు