
కర్నూలు, 21 జూన్ (హి.స.)ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. కానీ, ఒక తండ్రి ప్రేమను తెలిసిన ఏ బిడ్డకైనా ప్రతి రోజూ ఫాదర్స్ డేనే. తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు... మన జీవితంలో నిరంతరం వెలుగునిచ్చే ఒక నిశ్శబ్ద ఆకాశం. చిన్నప్పుడు మనం ఏడుస్తే, తన బాధలన్నీ మరచిపోయి మనల్ని ఎత్తుకునేవాడు. ఆయన భుజం మీద తల వాల్చి ఎంతో హాయిగా నిద్రపోయిన రోజులు ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటాయి. అయితే, ఆ భుజాలు కుటుంబం కోసం ఎంతటి బాధ్యతల బరువును మోస్తున్నాయో ఆ వయసులో ఎవరికీ తెలియదు. వయసు పెరిగి, బాధ్యతలు భుజాల మీదకు వచ్చినప్పుడే నాన్న పడిన కష్టం విలువ ప్రతి బిడ్డకూ అర్థమవుతుంది.
మన భవిష్యత్తు బాగుండాలని, మనల్ని ఒక ఉన్నత స్థానంలో చూడాలని తండ్రి తన కోరికలన్నింటినీ మనసులోనే చంపేసుకుంటాడు. తనకు ఒక కొత్త చేతి గడియారం కావాలనుకున్నా, ఆ డబ్బుతో పిల్లల స్కూల్ ఫీజు చెల్లించే మనస్తత్వం నాన్నది. తనకు ఒక కొత్త షర్టు కొనుక్కోవాలని ఉన్నా, ఆ ఖర్చును తగ్గించుకుని ఇంటి అవసరాలకు మొదటి ప్రాధాన్యతనిస్తాడు. జీవితంలో ఎప్పుడూ నాకు ఇది కావాలి అని ఏ తండ్రీ అడగడు. కానీ, నా పిల్లలు బాగుండాలి అని మాత్రం ప్రతి రోజూ కోరుకుంటూ ఉంటాడు. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా, నాన్న ముందు చాలు... ఒక తెలియని ధైర్యం, సమాధానం దొరుకుతాయి. ఆయన పెద్దగా మాట్లాడకపోయినా, ఆ మౌనంలోనే ఒక కొండంత అండ కనిపిస్తుంది. బిడ్డల కళ్లలో ఎప్పుడూ గొప్పతనాన్ని మాత్రమే చూస్తూ, వారి తప్పులను క్షమిస్తూ, వారి చిన్న చిన్న విజయాలకే ప్రపంచంలోనే అత్యధికంగా సంతోషపడే ఏకైక వ్యక్తి తండ్రి
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV