
హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
కారుచౌకగా మొబైల్స్, ఎలక్ట్రానిక్
గ్యాడ్జెట్కు కేరాఫ్గా ఉన్న హైదరాబాద్లోని అబిడ్స్ (Abids) జగదీష్ మార్కెట్ (Jagadish Market) లో అబిడ్స్ పోలీసులు సోమవారం మెరుపు దాడులు చేశారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేర్లను వాడుకుంటూ కస్టమర్లను మోసం చేస్తున్న భారీ నకిలీ ప్రొడక్ట్స్ దందాను ఛేదించారు. ఈ తనిఖీల్లో భాగంగా వన్ప్లస్ (OnePlus) బ్రాండ్కు చెందిన భారీ మొత్తంలో నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. 'వన్ ప్లస్' కంపెనీ ప్రతినిధి నాగేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు జగదీశ్ మార్కెట్లో రామ్ చౌదరి (Ram Chowdary) అనే వ్యక్తి పటేల్ మొబైల్స్ పేరుతో షాప్ నడుపుతున్నాడు. అందులో ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ 'వన్ ప్లస్' పేరుతో నకిలీ ప్రాడక్ట్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు షాపులోని రూ.12 లక్షలు విలువ చేసే నకిలీ వన్ ప్లస్ నెక్ బ్యాండ్స్, ఇయర్ పాడ్స్, ఛార్జర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్లను స్పాట్లోనే సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా రామ్ చౌదరి గత కొంతకాలంగా వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిపై పోలీసులు కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు