
హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
గాజా యుద్ధం, పాలస్తీనా అంశంపై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు. పశ్చిమాసియాతో సంబంధాల విషయంలో భారత్ తన చారిత్రక వైఖరికి దూరమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో ప్రత్యేక వ్యాసం రాశారు. అయితే విదేశాంగ విధానంపై కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
గాజాలో పౌరుల మరణాలపై భారత్ బలంగా స్పందించడం లేదని సోనియా విమర్శించారు. పాలస్తీనా హక్కులకు మద్దతుగా భారత్ గతంలో అవలంబించిన విధానానికి ఇప్పుడు దూరమవుతోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర దర్యాప్తు కమిషన్ నివేదికను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజాలో వేలాది మంది చిన్నారులు మరణించారని, మరెందరో గాయపడ్డారని తెలిపారు. అంతర్జాతీయ సమాజం ఇప్పటికీ ఈ ఘర్షణను నిలిపివేయడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు.
భారత్ ఈ అంశంలో ‘ఒంటరి మౌన స్వరం’గా మారిందని సోనియా అన్నారు. ఇది నైతికంగానే కాకుండా జాతీయ ప్రయోజనాల కోణంలోనూ సమర్థించలేని వైఖరని పేర్కొన్నారు. పాలస్తీనాతో భారత్కున్న చారిత్రక సంబంధాలను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా స్పందించాలని కోరారు.
సోనియా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ విధానం కంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. గాజా అంశంపై భారత్ తన వైఖరిని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిందన్నారు. కాల్పుల విరమణ తీర్మానాలపై ఐరాసలో ఓటు వేసిందని పేర్కొన్నారు. పాలస్తీనాకు మానవతా సాయం కూడా అందించిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలస్తీనా అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించిందని గుర్తుచేశారు. ఇజ్రాయెల్తో సంబంధాలను కాంగ్రెస్ గతంలో నిర్లక్ష్యం చేసిందని అభిప్రాయపడ్డారు
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi