
జగిత్యాల, 01 జూలై (హి.స.)
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటరు జాబితాలో చోటు కల్పించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోరుట్ల పట్టణంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వీలు) ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఫారాలను పంపిణీ చేస్తున్న తీరును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎలో ్వల పనితీరును పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడి ఫారాలు అందాయా, అవసరమైన వివరాలు తెలియజేశారా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఎల్ వోలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందించాలని, ఒక్కరైనా మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించి, ఫారాలను ఎలా నింపాలి, ఏ పత్రాలు జతచేయాలి, ఎక్కడ సమర్పించాలి వంటి అంశాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. ఓటర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి, అందులోని వివరాలను క్షుణ్ణంగా ధృవీకరించాలని అధికారులకు ఆదేశించారు. కొత్తగా అర్హత పొందిన వారి పేర్లను జాబితాలో చేర్చడం, అవసరమైన సవరణలు చేయడం, నిబంధనల మేరకు అనర్హుల పేర్లను తొలగించడం వంటి ప్రక్రియలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు