
హైదరాబాద్, 01 జూలై (హి.స.)ఆదాయ సమీకరణపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్గా దృష్టి సారించాలన్నారు. HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్తో పాటు వివిధ శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలని సూచించారు. ఈరోజు(బుధవారం) ఎమ్సీఆర్హెచ్ఆర్డీ(MCRHRD)లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆదాయ సమీకరణకు సంబంధించి ఛేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు.
అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా డిపార్ట్మెంట్స్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. AI టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను డీబీటీ(DBT)కి అనుసంధానం చేసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్ను తయారు చేసుకోవాలన్నారు. భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచనలు చేశారు. ఊహాజనిత బడ్జెట్ కాదని.. వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ను రూపొందించుకోవాలని అధికారులకు తెలిపారు. వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందే అని మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్