
హైదరాబాద్, 01 జూలై (హి.స.)
కల్వకుంట్ల కవిత స్థాపించిన నూతన రాజకీయ పార్టీ పేరుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆమె ప్రతిపాదించిన 'తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)' పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు అందాయి. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ అభ్యంతరాలను ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు వ్యక్తం చేశారు. గతంలో 'తెలంగాణ రాష్ట్ర సమితి'గా ఉన్న తమ పార్టీ పేరును ఇది పోలి ఉండటం వల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు అభ్యంతరాలపై కవిత పార్టీ ప్రతినిధులు ఈసీకి వివరణ ఇచ్చారని, మిగిలిన వాటికి కూడా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
తెలంగాణ ఉద్యమంలో 'టీఆర్ఎస్' కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 2026 ఏప్రిల్ నెలాఖరులో కవిత తన నూతన పార్టీని ప్రకటించిన సమయంలో, ఈ పేరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అనంతరం, ఈసీఐ అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది. జూన్ నెలలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, సోలాపూర్‌కు చెందిన మరో సంస్థ కూడా ఇదే తరహా పేరు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi