
న్యూఢిల్లీ, 11 జూలై (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటను (Red Fort) బాంబుతో పేల్చివేస్తామంటూ వచ్చిన ఒక బెదిరింపు ఫోన్ కాల్ శనివారం ఉదయం తీవ్ర కలకలం రేపింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించాయి. అయితే చివరకు అది ఒక నకిలీ (Hoax) కాల్‌గా తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. ఈ బెదిరింపు ఫోన్ కాల్ మొదట ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చింది. ఎర్రకోట వంటి అత్యంత కీలకమైన కట్టడ భద్రతకు సంబంధించినది కావడంతో ముంబై పోలీసులు వెంటనే ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్‌తో కలిసి ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నింటినీ అంగుళం అంగుళం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడం, ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు సాంకేతిక విశ్లేషణ ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi