
ఆసిఫాబాద్, 11 జూలై (హి.స.)
గ్రామ పంచాయతీలే గ్రామాల అభివృద్ధికి కేంద్రబిందువులని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆసిఫాబాద్ లోని మానిక్లూడ, వాంకిడిలోని కోమటిగూడ గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలతో పాటు, కెరమెరి మండలంలోని ధనోరలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన వీవో (V0) నూతన భవనాలను జిల్లా కలెక్టర్ కె. హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగలతో కలిసి వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం, పేదల గృహ నిర్మాణం వంటి అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే వీవో, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించినట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ భవనాల ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ, స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలు సంఘటితంగా ముందుకు సాగి స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించాలని కోరారు. అనంతరం ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..