
బెంగళూరు, 11 జూలై (హి.స.)మధుమేహం, అధిక రక్తపోటు, మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీట్రూట్ కిడ్నీ రోగులకు మంచిదా? లేక హానికరమా? అనే సందేహానికి బెంగళూరుకి చెందిన ఆరోగ్య నిపుణులు డా. పుల్లా రావ్ చిలకముడి ఏమంటున్నారో తెలుసుకుందాం..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం.. కాల్షియం ఆక్సలేట్ రాళ్లు వచ్చే ప్రమాదం ఉన్నవారు ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. బీట్రూట్ కూడా అలాంటి ఆహారాల్లో ఒకటి. అయితే, కిడ్నీ బాధితులు బీట్రూట్ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల సమస్య లేకపోతే.. వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు పరిమిత మోతాదులో బీట్రూట్ తీసుకోవచ్చు. అంటే, బీట్రూట్ తినాలా వద్దా అనేది మీకు ఉన్న కిడ్నీ సమస్య రకాన్ని బట్టి నిర్ణయించాలి. వైద్యుల సలహా లేకుండా ఆహారంలో పెద్ద మార్పులు చేయకపోవడం మంచిది.
కిడ్నీ బాధితులు ఏం తినాలి?
కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణులు సూచించిన ఆహారాన్నే పాటించాలి. సాధారణంగా, తగినంత నీరు తాగడం, తాజా పండ్లు, తక్కువ ఆక్సలేట్ ఉన్న కూరగాయలు, తృణధాన్యాలు, అవసరమైన మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. అలాగే ఉప్పు వినియోగాన్ని తగ్గించి, ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవడమే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV