
ఢిల్లీ, 11 జూలై (హి.స.) పశ్చిమాసియా (Middle East)లో ఉద్రిక్తతలు మరోసారి అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ (Strait of Hormuz) జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డగించడం, దానికి ప్రతిచర్యగా అమెరికా వైమానిక దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం కూడా వెనక్కి తగ్గకుండా అమెరికా సైనిక స్థావరాలపై భారీ ఎత్తున క్షిపణుల వర్షం కురిపించింది. ఇరుపక్షాల మధ్య దాడులు ప్రతిదాడులతో పరిస్థితి చేజారిపోతుండటంతో, అమెరికా తాజాగా ఇరాన్కు 24 గంటల డెడ్లైన్ విధించింది. వాణిజ్య నౌకలపై కాల్పులు జరపడం తప్పేనని ఇరాన్ బహిరంగంగా ఒప్పుకుంటేనే దాడులు ఆపేస్తామని, అప్పటిదాకా తమ సైనిక చర్యలు కొనసాగుతాయని అమెరికా అల్టిమేటం జారీ చేసింది.
అంతేకాకుండా, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతామని, అక్కడ ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని ఇరాన్ స్పష్టమైన ప్రకటన చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ షరతులకు లోబడకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే, ఇరాన్ కూడా దీనిపై అంతే ఘాటుగా స్పందిస్తూ తాము చర్చల కోసం అడగలేదని, అమెరికా హెచ్చరికలకు లొంగి దాడులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రేపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV