
రాజన్న సిరిసిల్ల, 12 జూలై (హి.స.)
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు పండించిన పంటలను భద్రంగా మార్కెట్కు తీసుకువచ్చి విక్రయించేందుకు అవసరమైన వసతులను దశలవారీగా కల్పిస్తున్నామన్నారు. సర్దాపూర్ మార్కెట్ యార్డులో నిర్మించనున్న ప్రహరీ గోడ పూర్తైతే యార్డు భద్రత మరింత బలోపేతం అవడంతో పాటు మార్కెట్ నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగేందుకు ఉపయోగపడుతుందన్నారు. రైతులు, వ్యాపారులు, హమాలీలు తదితరులకు అనుకూలమైన వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు