
జగిత్యాల12(హి.స.)
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. విద్యాశాఖ, రాష్ట్ర పరిపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే పాలనా ఏబీసీడీలు నేర్పించాలంటూ ఎద్దేవా చేశారు. జగిత్యాల పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ నిధులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీకే ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అర్వింద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ, రాష్ట్ర పరిపాలనను అమ్ముకుంటోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవేనని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేటీఆర్, హరీశ్ రావులు స్పందించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. హరీశ్ రావు రక్తాలు పారించడం కాదు.. నిజాలు పారించాలని, కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ముట్టడించడం కాదు, ముందు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను ముట్టడించాలని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో పాలన అంతా ఇంట్లో నుంచే సాగిందని మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరారు. ప్రజల నుంచి దోచుకున్న వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ వద్ద ఉన్నాయని, ఆ డబ్బుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం తప్ప, ప్రజల్లో వారిపై నమ్మకం పోయిందని, వారు ఎన్నటికీ కోలుకోలేరని విమర్శించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలంగాణలోనే వరెస్ట్ ఎమ్మెల్యే అని, ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ నేత కాలేరని అర్వింద్ విమర్శించారు. సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేశారని ఆరోపించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు అడిగితే కేవలం 2 ఎకరాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కాకపోతే రేపైనా సరే విద్యాలయానికి 10 ఎకరాల భూమిని సాధించుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు రావని చెప్పిన సంజయ్, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాక కేంద్ర నిధులు రావాలని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లబ్ధిదారుల జాబితా ఇవ్వకపోవడం వల్లే కేంద్రం నిధులు ఆపాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బీజేపీకి చెందిన సర్పంచ్లను పార్టీ మార్పించేందుకు ఎమ్మెల్యే నిధులు ఆపుతున్నారని, ఇదంతా బీఆర్ఎస్ కల్చర్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఉసురు తగిలి అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో న్యాయబద్ధంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ప్రజలు కూడా బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు