
విజయవాడ,:, 26 జూలై (హి.స.)
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని దేవాలయం ఈవో శీనా నాయక్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆదివారం విజయవాడలో దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీతో కలిసి ఈవో శీనా నాయక్ మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు పండించిన మొదటి పంటను సమర్పిస్తారని చెప్పారు. ఇప్పటివరకు 12 వేల టన్నుల కూరగాయలు దాతల నుంచి వచ్చాయని పేర్కొన్నారు.
అమ్మకి ఆలంకరించిన కాయగూరలతో కదంబ ప్రసాదం తయారు చేసి.. ఈ మూడు రోజులు భక్తులకు అందచేస్తామని దుర్గ గుడి ఈవో అన్నారు. మరో వైపు అమ్మవారి దర్శనం కోసం వీఐపీ తాకిడి ఉంటుందని తెలిపారు. అయినా.. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశామని వివరించారు.
జులై 15 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జులై 27, 28, 29 తేదీల్లో దుర్గమ్మ దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణ నుంచి బోనాల సమర్పణకు ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో జులై 26వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశారు. గత ఆదివారం వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వచ్చారు. దీంతో నేడు (ఆదివారం) ముందస్తు జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఘాట్ రోడ్డు వైపు ప్రైవేట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ఈ మార్గంలో పూర్తిగా దేవస్థానం బస్సులను మాత్రమే నడుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ