
హైదరాబాద్, 26 జూలై (హి.స.)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన నగరంలోని కూకట్పల్లి (Kukatpally)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. సరదాగా క్రికెట్ ఆడేందుకు స్కూటీపై ముగ్గురు యువకులు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహేశ్ (17), లక్ష్మీ తేజ (17) అనే ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్కు చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..