
వనపర్తి, 03 జూలై (హి.స.) వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట
గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాలలో శుక్రవారం నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ముఖ్య అతిథులుగా హాజరై కిచెన్ షెడ్ ప్రారంభించి, నూతన తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు పోషకాహారం అందించి వారి ఆరోగ్యంతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాయిని పేట పాఠశాలకు జిల్లా కలెక్టర్ తన నిధుల నుంచి రూ.23.80 లక్షలు మంజూరు చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, ఇందుకు ప్రత్యేకంగా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధస్సు (AI) విద్యను కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, రాయినిపేట ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతమైన ఉపాధ్యాయ బృందం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను మరింత సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించాలని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..