
ఆసిఫాబాద్, 30 జూలై (హి.స.)
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ గురువారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. కాగజ్నగర్ పెద్దవాగుతో పాటు దహెగాం, పెంచికల్పేట్ మండలాల సరిహద్దుల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, వంతెనల వద్ద నీటి ప్రవాహాన్ని ఎస్పీ దగ్గరుండి తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితుల పై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు ఎస్ఈఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచినట్లు, రెస్క్యూ బృందాల వద్ద లైఫ్ జాకెట్లు, బలమైన రోడ్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వంతెనలు, వాగుల వద్ద వాహనదారులు, బాటసారులు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులతో ఏర్పాటు చేసినట్లు, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులను దాటేందుకు ఎలాంటి సాహసం చేయకూడదని, వరద ప్రమాదాలు లేదా అత్యవసర సహాయం కోసం వెంటనే ఉచిత నంబర్లు 100 లేదా 112 కి సమాచారం అందించాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..