
జగిత్యాల, 30 జూలై (హి.స.)
జగిత్యాల జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్-ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును గురువారం జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గత రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు ఫకీర్ కొండపూర్ వాగులో నీటి ప్రవాహ పరిస్థితులను పరిశీలించి,ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.వర్షాల కారణంగా వాగుల ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,అవసరమైన చోట ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, అదేవిధంగా నది ప్రవాహ ప్రాంతాలను చూడడానికి ప్రజలు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..