'ఆపరేషన్ కవచ్'కు విజయవంతంగా ఏడాది.. కామారెడ్డి జిల్లా ఎస్పీ
'ఆపరేషన్ కవచ్'కు విజయవంతంగా ఏడాది.. కామారెడ్డి జిల్లా ఎస్పీ
Sp


కామారెడ్డి, 30 జూలై (హి.స.)

జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా 2025 జూలై 25న ప్రారంభించిన 'ఆపరేషన్ కవచ్' విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది.

ప్రీవెంటివ్ పోలీసింగ్లో భాగంగా రాత్రి వేళల్లో చేపట్టిన వాహన తనిఖీలు, గస్తీలు, అనుమానితుల పరిశీలనతో నేరాల నియంత్రణలో గణనీయమైన ఫలితాలు సాధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా 5,16,984 వాహనాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి సారించి 3,572 కేసులు నమోదు చేశామని, 1,19,052 మందిని పాపిలాన్ పరికరంతో పరిశీలించి 209 మంది అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు.

డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా 6 ఎన్టీపీఎస్ కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 403 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రూ.2.01 కోట్లు ఉంటుందని చెప్పారు. జాతీయ రహదారి-44పై పనసపండ్ల లోడులో అక్రమంగా తరలిస్తున్న 387 కిలోల గంజాయిని ఒక్క కేసులోనే స్వాధీనం చేసుకోవడం విశేషమన్నారు. అలాగే అక్రమ ఇసుక రవాణాపై 11 కేసులు, పశువుల అక్రమ రవాణాపై 3 కేసులు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై 3 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా రూ.43 లక్షల నగదు, 18 దొంగిలించిన మోటార్ సైకిళ్లు, 5 దేశీయ తుపాకులు, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ కవచ్ అమలుతో జిల్లాలో అంతర్రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలు 12 నుంచి 2కు తగ్గినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దేవాలయ చోరీలు, ఆస్తి నేరాలు, ఏటీఎం చోరీ కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోసానిపేటలో యజమానికి తెలియక ముందే దొంగిలించిన ట్రాక్టర్ను కేవలం రెండు గంటల్లోనే రికవరీ చేయడం పోలీసుల అప్రమత్తతకు నిదర్శనమన్నారు.

మానవీయ కోణంలో కూడా పోలీసులు విశేష సేవలు అందించారని ఎస్పీ తెలిపారు. తప్పిపోయిన 14 ఏళ్ల బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు, వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్న 8 మంది ముఠాను అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న తనిఖీలు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని, నేరస్థులు, అక్రమ రవాణాదారులను అడ్డుకోవడానికేనని స్పష్టం చేశారు. మీ భద్రత - మా బాధ్యత అనే నినాదంతో జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ కవచ్లో విశేష ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని నగదు పురస్కారాలతో సత్కరించగా, అనంతరం కేక్ కట్ చేసి విజయోత్సవాన్ని జరుపుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande